నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును సమస్త కీడు నుండి కాపాడి ఉన్నత స్థితికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. కనుకనే, దేవుడు ఈ లోకములో కీడును అనుమతిస్తాడు, మరియు ఆ కీడు మధ్యలో కూడా, ఆయన మన జీవితాలలో తన శక్తిని బయల్పరచి, మీ కీడును అధిగమించి దానిని జయించడానికి మనకు బలమును అనుగ్రహించుచున్నాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి. దుష్టత్వము మిమ్మును ఎన్నటికిని నాశనము చేయదు; అది మిమ్మును తాకదు. దుష్టత్వం మిమ్మును చుట్టుముట్టి, దాని శక్తి అధికమగుచున్నదని అనిపించినప్పటికిని, ఆ పరిస్థితులలోనే దేవుడు తన రక్షణ శక్తిని మీకు బయలుపరుస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 121:7 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము,"ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును''అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు ఎటువంటి కీడును రాకుండా మిమ్మును కాపాడతాడు. నా ప్రియులారా, ఎటువంటి దుష్టత్వం మీకు ఎదురైనప్పటికిని, మీ ఆత్మ కల్మషము కాకుండా దేవుడు మీ ఆత్మను మరియు మిమ్ములను కూడా కాపాడతాడు. అందుకే బైబిల్‌లో, "ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకున్నట్లయితే, వానికి ఏమి లాభము?'' అని చెప్పబడినట్లుగానే, మన ఆత్మ దేవునితో ఏకము కావాలి. అది పరిశుద్ధంగా ఉండాలి. అది ఎంతో ప్రాముఖ్యం. మరణం తర్వాత ఆత్మ దేవునితో ఐక్యమవ్వాలి. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది. పరలోకంలో ఇహలోకపరమైన వివాహములు గానీ, ఈ లోక సుఖభోగములు గానీ ఉండవు. అక్కడ ప్రతి ఒక్కరూ దేవునిలో సహవాసము కలిగియుంటూ, ఆయనతో కలిసి ఏకమవుతారు మరియు దేవదూతలవలె ప్రతి ఒక్కరు ఉంటారు అని లేఖనములో చెప్పబడినట్లుగానే, యేసు కూడా ఇలాగే తెలియజేసియున్నాడు. కాబట్టి, మనము దేవుని కృపను పొంది, పరిశుద్ధమైన జీవితమును గడపాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, నేటి నుండి ఆయనతో అన్యోన్యసహవాసమును కలిగియుండండి.
నా ప్రియులారా, దేవుని వాక్యమును చూచినట్లయితే, మన ప్రాణములను కాపాడుకొనునట్లుగా, దేవుడు మనలను ఈ లోకంలో ఉన్న కీడు మరియు అపాయమును నుండి మనలను విడిపించుచున్నాడు. దేవుడు నేడు మీకు అటువంటి కృపను అనుగ్రహించి, ఏ అపాయమును రాకుండా కాపాడును గాక. అందుకే బైబిల్ నుండి సామెతలు 13:20వ వచనములో చూచినట్లయితే, "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును'' ప్రకారం, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానియగును; మూర్ఖులకు కీడు కలుగును. ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారుగా ఉన్నవారు ఈ లోకపు కీడులో సులభంగా చిక్కుకుపోతారు. కానీ, జ్ఞానులతో నడుచుచూ, జ్ఞానమును సంపాదించుకోవడానికి దేవుడు మనకు అవకాశం కల్పిస్తాడు. నిజమైన జ్ఞానం అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగియుండుటయే. దేవుని యందలి భయభక్తులు అనగా, దేవుని యందు భయము. దైవభయం జ్ఞానమును కలిగించుచున్నది. కనుకనే, మనము దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా ఉండునట్లుగా దేవుని జ్ఞానము మనలను నడిపిస్తుంది.
నా ప్రియులారా, అనేకమంది ఈ లోకపరమైన ప్రణాళికల ప్రకారం జ్ఞానులుగా ఉండవచ్చును, కానీ వారు ఇంకా పాపపు దుర్‌వ్యసనములలో చిక్కుకొనిపోయి ఉండవచ్చును. ఒకసారి, ఒక కలెక్టర్ నాతో ఇలాగున అన్నారు: ' విద్యార్థులందరూ ఎందుకు ప్రార్థించవలెను? మనము ఎందుకు దేవుని కృప కొరకు ప్రార్థించాలి? మేమందరం ఇంజనీరింగ్ చదివియున్నాము కదా. జీవితము అనగా ఇంతే కదా! విద్యార్థి జీవితము అంటే ఇంతే కదా. అయితే, మేము విజయం సాధించలేదా? మాకు జ్ఞానము లేదా?' అని ప్రశ్నించాడు. అయితే, మరుసటి రోజు ప్రభుత్వం అతనిని ఆ పదవి నుంచి అతనిని తొలగించివేసెను. చివరి వరకు అతనికి ఉన్నత పదవి ఇవ్వలేదు. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. కాబట్టి, ఈ లోకములో జీవించుచున్న మనము ఎంతో జాగ్రత్తగా ఉండలెను.
అవును, నా ప్రియులారా, లోకసంబంధమైన జ్ఞానము ఉండవచ్చును. కానీ, దేవుని యందు భయభక్తులు కలిగియుండనట్లయితే, దానివలన ఏమి లాభము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆకాశమండలములోని జ్యోతులవలె ప్రకాశించే కృపను మనము పొందుకుంటాము. దేవుడు మీకు అట్టి కృపను అనుగ్రహిస్తాడు. ఆలాగుననే, మీ వెలుగును చూచిన వారందరు కూడా మీ పట్ల ఆనందించెదరు. నా ప్రియులారా, దేవుడు మిమ్మును అపాయమును నుండి కాపాడి, మీరు ఆయనను ప్రేమించునట్లుగా మీకు సహాయము చేస్తాడు. ఆయనను ప్రేమించుటకును, ఆయనతో నడుచుటకును మరియు ఇతరులతో సమాధానముగా జీవించుటకు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మును సమస్త కీడు నుండి విడిపించి, తన మార్గములలో నడుచుకునే కృపను మీకు అనుగ్రహిస్తాడు.
బైబిల్‌లో యోసేపును చూచినట్లయితే, అతని అన్నలు తనకు హాని చేయాలని తలంచారు. బైబిల్ నుండి ఆదికాండము 50:20వ వచనములో చూచినట్లయితే, యోసేపు, " మీరు నాకు కీడు చేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను'' అని చెప్పాడు. అవును, యోసేపు తన అన్నలతో, 'మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. కానీ, దేవుడు దానిని మేలుగా మార్చాడు' అని చెప్పాడు. అవును, అతని అన్నలు అతనికి హాని చేయాలని ఉద్దేశించారు. కనుకనే, వారు అతనిని బానిసగా అమ్మి వేశారు. తద్వారా, అతడు బానిసగా అన్యదేశమునకు కొనిపోబడ్డాడు. అయితే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గనుకనే, దేవుడు యోసేపును ఆశీర్వదించి, అనేకమందిని రక్షించునట్లుగా, అతనిని ఆ దేశమునకు అధిపతిగా ఉన్నత స్థానమునకు హెచ్చించాడు. అంతమాత్రమే కాదు, దేవుడు సమస్తమును మేలుగా మార్చియున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనములో చూచినట్లయితే, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు, అవి మీకు మేలు కలుగజేయునవి గానీ, కీడు చేయునవి కావు. కనుకనే, భయపడకండి.
నా ప్రియులారా, నేడు మిమ్మును గూర్చిన ఉద్దేశములు, ప్రణాళికలు దేవుడు ఎరిగియున్నాడు. అవి కీడు కొరకు కాదు, కానీ సమాధానకరమైనవిగాను, నిరీక్షణను కలిగించుట కొరకును మరియు మంచి భవిష్యత్తును అనుగ్రహించుట కొరకు మాత్రమే అని మీరు గుర్తించి, నేడు మీ జీవితమును ఆయన హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, తన బిడ్డలైన మిమ్మును కీడు నుండి కాపాడి, జ్ఞానులతో నడవడానికి మీకు సహాయం చేసి, అనేకులకు మిమ్మును వెలుగుగా చేసి, మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మేము ఎదుర్కొంటున్న ప్రతి కీడు నుండి మమ్మును కాపాడుము. దేవా, నీ యెదుట మా ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకొనునట్లుగా మరియు జ్ఞానులతో నడవడానికి మరియు నీ యందు భయభక్తులు కలిగియుండుట ద్వారా నిజమైన జ్ఞానములో ఎదగడానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, మేము ఈ లోకపు దుష్ట మార్గములను లేదా పాపపు మార్గములను అనుసరించకుండా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు యోసేపునకు జరిగించినట్లుగానే, మాకు విరోధముగా అపవాది లేక మా శత్రువులు పన్నిన ప్రతి కీడును మాకు మేలుగా మార్చుము. యేసయ్య, మేము నిన్ను ప్రేమించడానికి, నీతో నడవడానికి మరియు అనేకులకు వెలుగుగా ప్రకాశింపజేయడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, సమాధానకరమైన, నిరీక్షణను కలుగజేయునట్లుగాను, మాకు భవిష్యత్తుకు సంబంధించిన నీ ప్రణాళికలు మా జీవితములో నెరవేరునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యందు విశ్వాసము గలిగియుంటూ, నిన్ను సేవించడానికి మమ్మును నీ యొక్క ప్రేమ మరియు శక్తితో బలపరచి, ఇతరులకు సేవ చేయు అవకాశమును మాకు కల్పించి, మమ్మును శాన్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


